కేశవ రావు నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుని అది మరుగుతున్న టీ లో పడకుండా జాగ్రత్త పడుతూ ఒక సారి తన బండి దగ్గర చేరిన వారిని ఒకింత గర్వంగా చూస్కున్నాడు.  వారిలో టీ మాత్రమే తాగేవాళ్ళు కొందరైతే సిగరెట్లు పక్క షాపులో తెచ్చుకుని తన బండి దగ్గర టీ తాగుతూ కబుర్లు చెప్పేవారు కొందరు. తన పని ముఖ్యంగా తెల్లవారు ఝామున, 11 గంటలకి ఎండ వేళలో, మళ్ళీ సాయంత్రం 3 నించి 4 మధ్యలో ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య ప్రతి చోట అలుపు అన్నది లేకుండా జరిగే కట్టడాల వల్ల పెరిగిన కూలీలతో దాదాపు రోజంతా బండి దగ్గర జనం గుమిగూడుతున్నారు. ఎన్ని పాలు కావాలో ఒకోసారి అంచనా తప్పితే ఈ రోజు లాగ ఆదిత్యని పంపాలి తేవడానికి. వాడికి ఈ పనులు అసలు ఇష్టం లేకపొయినా తండ్రిని నొప్పించడం ఇష్టం లేక, అతని కష్టం చూడలేక గొణుగుతూ అయినా తెస్తాడు. తను ఇలా టీ బండి పెట్టుకోవడం ఆదిత్యకి నామోషిగా ఉంటుందేమోనని అప్పుడప్పుడు కేశవకి అనిపించినా, దీని లోని స్థిరమైన సంపాదన, ఎవరి మీదా ఆధార పడడం లేదనే సంత్రుప్తి, అతనికి వేరెందులోనూ కలగవేమోనని భయంతో ఆ బండిని అలాగే నెట్టుకొస్తున్నాడు.

ఇంతలో దూరంగా నడుచుకుంటూ బండి దగ్గరకే వస్తున్న సూర్య కనిపించాడు.

"బాబాయ్!! అల్లం టీ ఒకటివ్వు" అన్నాడు నీర్సంగా

"ఏరా...ఊర్లో ఉన్న కష్టాలన్నీనీకే ఉన్నట్టు అలా మొహం ఏలాడదీస్కుని కూచున్నావ్? పాలు ఆదిత్య తెస్తున్నాడు. 5 నిమిషాలు ఆగు"

"ఆగక నేను చేసే పనేముంది బాబాయ్...నాకేమైనా ఉద్యోగమా సద్యోగమా"

"ఉద్యోగం దేముంది లేరా...అదే వస్తాది"

"ఏమో బాబాయ్!! కూలి పనికే పోదామనుకుంటున్నా"

"సంపుతా ఇంకోసారి కూలి పని గీలి పని అన్నావంటే...దానికైతే ఇంత సదువెందుకు సదివినట్టు ఇన్నాళ్ళూ"

కేశవ మాటలతో సూర్య కొంచెం నొచ్చుకున్నా అది కనపడనివ్వకుండా టీ తాగి అక్కడ నించి వెళ్ళొస్తాను బాబాయ్ అంటూ కదిలాడు.

మళ్ళీ తన పనిలో పడిన కేశవ ద్రుష్టి తన బండి ఎదురుగా నించుని చేతిలోని చిన్న పుస్తకం లో ఎదో రాసుకుంటున్న ఒకతని మీద పడింది. చాలా బిజీగా తన పని తాను చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చే పొయే వారిని ఆపి ఏవో ప్రశ్నలు అడిగి వారిచ్చిన సమాధానలను చిరునవ్వుతో తన పుస్తకం లొ రాస్తున్న అతనిని చూసి కేశవకి ఒక ఉత్సుకత కలిగింది. ఇంతలో అతను తన బండి దగ్గరకే రావడం గమనించి

"ఏం కావాలి బాబు..టీ ఇమ్మంటారా?"

"ఆ ఇవ్వు అన్నా" అని చెప్పి జేబు లోనించి ఒక సిగరెట్ తీసి వెలిగించాడు. పొగ వదులుతూ కేశవ ఇచ్చిన టీ ని త్రుప్తిగా ఒక గుక్క మింగి మరలా పుస్తకం లో ఏదొ వ్రాయడం మొదలు పెట్టాడు. అతనిని ఎలా మాట్లడించాలా అని కేశవ అలొచిస్తుండగా అతనే

"అన్నా...నీ బండి దగ్గరకి రోజుకి ఎంత మంది వస్తారు?" అని అడిగాడు

"అలా లెక్క ఏముండదు బాబూ. కన్స్ట్రక్షన్ పనులు ఏమైనా జరిగేటప్పుడు ఎక్కువ మంది జనాలకి టీ కావాల్సి వస్తది..మామూలు రొజుల్లో ఇక్కడ ఉన్న ఆఫీసు వాళ్ళంతా నా బండి దగ్గరకే వస్తారు" 

"అలా కాదన్నా...ఒక నంబర్ చెప్పు"

"నంబర్ అంటే ఏం చెప్తాం బాబూ...ఒక 200 అనుకో "

"పోనీ రోజుకి నీకు ఎంత వస్తాది చెప్పు?"

"ఖర్చులకి సరిపొతాయి లే బాబూ. కొడుకు చదువుకి వాటికి కూడా కావాలి కదా...మిగిలేదేమీ లేదు"

తను మాట్లాడుతున్నా కూడా అతను ఆ పుస్తకం నించి తల ఎత్తకపోవడం చూసి  

"ఏం రాస్తున్నావ్ బాబూ అందులో?"

"ఏం లేదన్నా...ఇక్కడ ఒక కాఫీ షాప్ పెట్టాలనుకుంటున్నాం. పెడితే ఎలా ఉంటుంది లాభాలువస్తాయా లేదా అని సర్వే చేస్తున్నా "

"కాఫీ షాప్ ఏంది బాబూ?"

"అంటే నీ బండి లాంటిదే అన్నా..కాకపొతే కొంచెం పెద్దగా ఆ ముందు కనిపిస్తున్న స్థలం లో కడదామనుకుంటున్నాం. ఎలా ఉంటుందో అసలు ఎంత మంది జనం ఉన్నారో ఇక్కడ అని చుద్దాం అని వచ్చాను. జనాల అభిప్రాయలన్నీ సేకరించి వారికి ఎలాంటి సదుపాయాలు కావలో తెల్సుకుని అవన్నీ ఆ షాప్ లో వారికి ఇస్తాం."

"అంటే నా బండి కి పొటీగా ఇంకో పెద్ద బండి ఏస్కుని వస్తారన్నమాట" అన్నాడు కేశవ నవ్వుతూ

"అలానే అనుకో అన్నా" అంటూ తన నవ్వులొ నవ్వు కలిపి టీ డబ్బులు ఇచ్చేసి లేచాడు

"నీ పేరేంది బాబూ" అతని వెనక పిలిచినట్టుగా అదిగాడు

"నవీన్" అని చెప్పి వెళ్ళిపోయాడు.

రాత్రి పది గంటలు కావస్తుండగా ఇంకా అతని మాటలు మదిలో మెదులుతూ ఇంటికి చేరుకున్నాడు కేశవ రావు. గదిలో ఆదిత్య ఏదొ పుస్తకాన్ని చదువుతూ కనిపించాడు. వాడిని ఒక సారి చుసి తిన్నాడో లేదో కనుక్కుని తను భోజనానికి వెళ్ళాడు. చేయ్యి కడుగుతుండగా ఆదిత్య వచ్చి 

"నాన్నా! ఒక 50 రూపాయలు ఇవ్వా?"

"ఎందుకు రా రోజూ డబ్బులు" అన్నాడు జేబులో నించి 50 రూపాయల నోటు తీసి ఇస్తూ.

ఆదిత్య సమాధానం చెప్పకుండా ఆ డబ్బు తీస్కుని గదిలోకి వెళ్ళి మొబైల్ రీచార్జ్ చేయించుకుని తన గర్ల్ ఫ్రెండ్ తో కబుర్లలో పడిపోయాడు. ఒక రాత్రి వేళ కేశవ నిద్ర లో నించి లేచి కొడుకు గది లోకి వెళ్ళి చూస్తే ఇంకా ఆ ఫోన్ లో కబుర్లు చెప్తున్న ఆదిత్యని చూసి ఏం మాట్లాడుతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో అని ఒక నిమిషం ఆలోచించి మళ్ళి లోపలకి వెళ్ళి పడుకున్నాడు.

*******

చూస్తుండగానె తన బండి ఎదురుగా ఉన్న ఖాళి స్థలం లో ఒక పెద్ద షాపింగ్ మాల్ దాని కింద భాగంలో నవీన్ చెప్పినట్లుగా ఒక కాఫీ షాప్ వెలిశాయి. రోజు పొదుగునా కిక్కిరిసిన ఖరీదైన జనం కార్లలోను, యువ జంటలు బైకుల పైన రావడం తో వీధి అంతా కోలాహలం గా మారిపొయింది. కన్స్ట్రక్షన్ పూర్తి కావడం తొ కూలీలు కూడా ఇంకో చొటు వెతుక్కున్నారు.  ఆదిత్య పరిక్షలు దగ్గర పడుతుండడం తో అసలు బండి దగ్గరకి రావడమే మానేసాడు.తను తెచ్చిన పాలు ఇంకా అలానే మిగిలిపోయాయి. 
*********
సైకిల్ తొక్కుకుంటూ సూర్య బండి దగ్గరకి వచాడు. చాలా హుషారుగా కనిపించాడు.

"ఏంది రా...ఈ మధ్య అసలు రావడమే మానేసావు?"

"నాకు ఉద్యోగం వచ్చింది బాబాయ్. జీతం ఆరు వేలు. ఇదిగో ఈ కొత్త సైకిల్ కూడా కొన్నాను"

"అబ్బో...ఇంతకీ ఎక్కడ ఉద్యోగం"

"అదే బాబాయ్..ఎదురుకుండా కనిపిస్తున్న కాఫీ షాప్ లోనే" అంటూ తన బండి ఎదురుగా ఉన్నకాఫీ షాప్ ని చూపించాడు.

"అందులో ఏం ఉద్యోగం రా" ఆశ్చర్యంగా అదిగాడు కేశవ రావు

"కస్టమర్స్ దగ్గర ఆర్డర్స్ తీస్కోవడం, వారికి కావల్సినది ఇవ్వడం, టేబుల్స్ అన్నీనీటుగా సద్దడం అలా అలా"

"ఏంది రా..సదువుకున్నొళ్ళు ఈ పనులన్నీ చేయడం"

"భలే వాడివే బాబాయ్...ఇంటర్ పాస్ కాని వాళ్ళకి మా షాప్ లో ఉద్యోగం రాదు" అన్నాడు సూర్య అదో రకం గా మొహం పెట్టి

"సర్లే...టీ ఇవ్వనా?"

"త్వరగా ఇవ్వు బాబాయ్...మాకు ఎక్కువ టైం ఉండదు బ్రేక్"

తను ఇచ్చిన టీ ని గబ గబా రెండు గుక్కలలొ తాగి అక్కడ నించి కదిలాడు సూర్య. వాడు వెళ్ళిన దిశగా చూస్తూ అలోచనలో పడ్డాడు కేశవ. రాత్రి 9 గంటలు కావస్తుండగా ఇక ఎవరూ వచ్చేది లేదనుకుని నెమ్మదిగా ఇంటికేసి కదిలాడు. ఆదిత్య గుమ్మం దగ్గరే తన కోసం ఎదురు చూస్తుండడం చుసి ఏం కావాలని అడిగాడు.

"నాన్నా..నాకు ఒక 500 రూపాయలు కావాలి" ఫోన్ లో ఎదో బుటన్స్ నొక్కుతూ అదిగాడు

"ఎందుకు రా...అంత డబ్బు". వాడి దగ్గర నించి ఏ సమధానం లేదు ఫోన్ లోకే చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతున్న కొడుకుని చూసి

"ఎప్పటికి కావాలి" అని అడిగాడు

"రేపే కావాలి నాన్నా...చాల ఇంపార్టంట్" అని చెప్పి గది లోపలకి వెళ్ళి తలుపు వేస్కున్నాడు.

ఇంత త్వరగా కావాలంటే ఇప్పుడు అప్పు కోసం ఎవడి దగ్గరకి వెళ్ళాలా అని ఆలోచనలతో భోజనం ముగించి నిద్ర లోకి జారుకున్నాడు.  

******

మర్నాడు కూడా బండి దగ్గర జనం అంతంత మాత్రం గానే ఉన్నా కేశవ మనసు పరి పరి విధాల పోతోంది. అప్పుడొకడు అప్పుడొకడు వచ్చి టీ తాగి వెళ్తున్నా తన ద్రుష్టి మాత్రం పని మీద లేదు. సాయంత్రం 4 గంటల వేళ అన్యమనస్కంగా ఎదురుకుండా ఉన్న కాఫీ షాప్ కేసి చూస్తే ఒక బైక్ పైన ఎవరో అమ్మాయి ఒక అబ్బాయిని ఎక్కించుకుని తీస్కుని రావడం గమనించాడు. అబ్బాయి ఎవరో తెలిసున్నట్టుగా అనిపిస్తే మళ్ళి చుశాడు. ఈసారి సరిగ్గా చుశాడు. ఆదిత్యే. పక్కన ఉన్న వారిని కాని రోడ్ మీద పొయే వారిని కాని పట్టించుకొకుండా నవ్వుతూ తుళ్ళుతూ ఆ అమ్మాయి తో కలిసి కాఫీ షాప్ లోకి వెళ్ళాడు. ఇందుకా తనని డబ్బు అడిగింది అని ఆలొచిస్తె గుండె చివుక్కు మంది. అలానె చూస్తూ ఉండిపొయాడు. ఎంతకీ వారు బైటికి రాకపోతుండడంతో తనే ఆ షాపు లోకి వెళ్ళాడు.

లోపలకి అడుగు పెట్టగానె చల్లగా ఏసీ వళ్ళంతా తాకింది. కొంత దూరం లో కూర్చున్న ఆదిత్యని, ఆ అమ్మాయిని చూసి వారికి కొంచెం దూరంగా ఒక కుర్చీ లో చతికిలపడ్డాడు.ఇద్దరూ పక్క పక్కగా కుర్చొని ఉన్నారు. వారి ముందు ఉన్న అద్దం లోనించి కొడుకు కళ్ళలో ఆనందం కనిపిస్తోంది. అమ్మాయి చక్కగా నవ్వుతోంది. తను అక్కడికి ఎందుకు వచ్చాడో అర్ధం కాలేదు కాని వారిద్దరిని చూసి ఎక్కడో ఒక చిన్న బాధ. 

"ఏం బాబాయ్ మా షాపు లో కాఫీ తాగడానికి నన్నే డబ్బులు అప్పు అడిగి మరీ వచ్చావా?" అని నవ్వుతూ పలకరించిన సూర్య ని చూసి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు

"అదేం లేదురా...నువ్ ఎలా పని చేస్కుంటున్నావో చూసి పోదాం అని" అని సన్నగా గొణిగాడు.

"ఇక్కడ వద్దులే బాబాయ్ రేట్లెక్కువ. మనం నీ బండి దగ్గరకెళ్ళి తాగుదం టీ. నాకు బ్రేక్ టైం ఐంది లే" అంటూ సూర్య అన్న మాటలతో లేచి మళ్ళీ తన బండి దగ్గరకి వచ్చాడు.

అయినా కేశవ ద్రుష్టి ఆదిత్య మీద నించి పోలేదు. వారు ఎప్పుడు బైటికి వస్తారా, అసలు ఆదిత్య తనని చూశాడా, చూసి చూడనట్టు నటించాడా, తన తండ్రి ఒక మామూలు టీ బండి నడుపుతాడని అమ్మాయికి పరిచయం చేయడానికి నామోషీ అనుకున్నాడా అని మనసులో మధన పడుతుండగా ఆ అమ్మాయి బైటకి వచ్చింది. వెనకగా ఆదిత్య కూడ వచి ఇద్దరూ బైక్ ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోయారు. సూర్యని పంపించేసి కేశవ వాళ్ళ వెనకాలే ఒక ఆటో లో వారిని వెంబడించాడు. అతను ఎందుకు వెళ్తున్నాడో అతనికే తెలీదు. ఎదురు పడితే ఏమనాలోకూడ తెలీదు కాని వారి వెనకాల ఏదొ పోగొట్టుకున్నది వెతుక్కుంటున్న వాడిలా వెళ్తున్నాడు.

వారిరువురూ ఒక సినిమా థియేటర్ లోకి వెళ్ళడం చూశాడు. ఆదిత్య మొహంలో నవ్వు చెరగడం లేదు. అమ్మాయి ఆదిత్య చేతిలో చెయ్యి పెట్టింది. వారి మాటలు ఆగడం లేదు. తనెందుకు కొడుకు ఆనందాన్ని ఆస్వాదించలేకపొతున్నడో అర్ధం కాలేదు కేశవరావుకి. వాళ్ళు వెళ్ళిపోయాక ఒక 10 నిమిషాలు అక్కడే కూర్చుని మళ్ళి కాళ్ళీడ్చుకుంటూ వెనుదిరిగాడు

******

బండి దగ్గరకి వచ్చాడే కాని ఏ పనీ చేయబుధ్ధి కాలేదు. కట్టేసి పోదాం అనుకున్నాడు కాని ఇంటి దగ్గర మాత్రం ఎవరున్నారులే అనుకుని అలానే కొత్తగా పెట్టిన కాఫీ షాప్ కేసి తదేకంగా చూస్తూ నిలబడిపోయాడు.

9 ఔతోందనగా ఒక బైక్ చప్పుడు వినిపించింది. దాని మీద అంతగా ద్రుష్టి పెట్టలేదు కేశవరావు. కాని ఆ గొంతు ఎక్కడో బాగా పరిచయం ఉన్న గొంతులా అనిపించి తిరిగి చూస్తే ఆదిత్య ఆ అమ్మాయి ని తన బండి దగ్గరకే తీస్కుని రావడం కనిపించింది

"ఇక్కడ టీ చాలా బాగుంటుంది" అని ఆ అమ్మాయితో అంటున్నాడు ఆదిత్య

కేశవని చూసి ఒక స్వచ్చమైన నవ్వు నవ్వింది ఆ అమ్మాయి. తను కూడా నవ్వాడు

"మా ఇద్దరికీ రెండు టీలివ్వు నాన్నా"